Thursday, August 13, 2015

అభివృద్ది

ఆకాశమంత ఎత్తున్న చెట్లని నరికించి
ఆకాశహర్మ్యములు కట్టించి వాటిపైకెక్కి
ఆత్మహత్య చేసుకోమనేదే అభివృద్ది

అడవితల్లిని అగ్నిదేవునితో అన్యాయంగా ముడిపెట్టి
పచ్చని వనాన్ని చితిమంటల స్మశానంగా మార్చి
బిల్డింగులు కట్టి అందులో బానిసలను నెట్టి 
డాలర్లను అడుక్కోమంటుంది అభివృద్ది

ఊళ్ళ కోసం రోడ్లను వేయడం కాదు
రోడ్ల కోసం ఊళ్ళకు ఊళ్ళే మాయం 
చేయమంటుంది మాయదారి అభివృద్ది

బానిసలచే పాలింపబడినంత కాలం
బానిసలలా ఆలోచించినంత కాలం
బానిస బ్రతుకుల నుంచి బయటపడనంత కాలం
బానిస స్వామ్యం ఇచ్చే అభివృద్ది ఇదే ...

Wednesday, August 12, 2015

లేకపోవటంలో

లేకపోవటంలో చాలావుంది
ఆకలి పస్తుల్లో ఆరోగ్యం వుంది
కష్టాలలో నమ్మకముంది
నష్టాలలో అనుభవముంది
దుఃఖంలో ఆత్మీయతుంది
ఓటమిలో పట్టుదల వుంది
అవమానంలో తెగింపు వుంది

లేకపోవటంలో చాలావుంది ...

పులగం

బియ్యంతో పెసరపప్పు కలిపి
నీళ్ళు పోసి కాస్త పసుపు చల్లి
పులగం వండి వార్చి
కలుపుకోడానికి వంకాయ కూర
నంజుకోవడానికి వేయించిన మిరపకాయలతో
వేడివేడిగా వెండి కంచంలో వడ్డిస్తే ...

నేలమ్మకు దగ్గరగా కూర్చొని
పులగంలో వంకాయ కూర కలిపి
చేతి నిండా తీసుకొని ముద్ద చేసి
నోటికందించి తోడుగా మిరపకాయ నమిలితే ...

Sunday, January 06, 2013

అనగనగా ఒక మాట


అనగనగా ఒక మాట
మనుషుల మధ్య బంధాలు 
పెంచాలన్నా 
తెంచాలన్నా

ఎదుటి వ్యక్తి హృదయములో
స్థానం సంపాదించాలన్నా
మాట వల్లే
మాటతీరు వల్లే

ఒక మాట
వ్యవస్థని నిర్మించగలదు
అదే మాట తేడా ఐతే
వ్యవస్థని నశింపచేయగలదు

మాటంటే సరస్వతి
మట్లాడటమంటే వాణికి అర్చనే
ఆ వాగ్ధేవీ ప్రవాహాన్ని 
సత్కార్యాలకే ఉపయోగించి
శారదమ్మ ఆశీస్సులు పొందుదాం